కరోనా: ఈ సమయంలో సీఏఏ నిరసనలా?

0
40

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మహమ్మారి వల్ల 8వేల మందికి పైగా మృతిచెందారు. 2 లక్షలమందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ దేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా సోకిన వ్యక్తులకు ఒక మీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉండటం, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ మంది.. కనీసం పదిమంది కూడా గుమికూడవద్దని సూచిస్తున్నారు.

ఇలాంటి సమయంలో చెన్నైలో కొంతమంది చేపట్టిన యాంటీ సీఏఏ ర్యాలీ విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా సోకకుండా ఎన్నో సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తుంటే నిర్లక్ష్యంగా ర్యాలీ నిర్వహించడం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో నిరసనకారులతో తాము సమావేశమయ్యామని, ఈ మహమ్మారి కారణంగా నిరసనలు ఇప్పుడు వద్దని కోరామని, అంతకుముందు రోజు కూడా తాము నిరసనకారులతో మాట్లాడామని, కానీ వారి నుండి సానుకూల స్పందన రాలేదని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు కేవలం పది పదిహేను మందితో మాత్రమే మాట్లాడారని, తాము కూర్చున్న ప్రదేశానికి రాలేదని నిరసనకారులు చెప్పారట. పోలీసులు వచ్చి పదిపదిహేను మందితో మాట్లాడారని, మీరే స్టేజ్ పైకి వచ్చి చెప్పాలని తాము పోలీసులకు చెబితే వారు రాలేదని మరో నిరసనకారుడు చెప్పారు.

మంగళవారం నాన్-పొలిటికల్ సంస్థ ఒకటి చెన్నైలో నిరసన చేపట్టింది. దేశంలో శరణార్థులుగా కంటే కరోనాతో చనిపోతామని నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో సమూహంగా రోడ్ల మీదకు వచ్చారు. అయితే కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా అమాయకులను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకు వస్తున్నారనేది కొంతమంది వాదన. ఈ ర్యాలీలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారట.

అయితే గత రెండున్నర నెలలుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఎంతోమంది స్వీయ నిర్బంధంలో ఉంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిరసనలు చేపట్టడం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడమే అంటున్నారు. సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్కరికీ ఇబ్బంది లేదని, అవగాహన లేని వారు అమాయకులను రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నారనేది బీజేపీ వాదన. ఏదేమైనా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇది సరికాదని నెటిజన్లు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here