పాసులిచ్చినా.. రోడ్డుపై.. హాస్టల్ విద్యార్థులకు అడుగడుగునా కష్టాలు

0
64

కరోనా మహమ్మారి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. భాగ్యనగరంలోని అమీర్‌పేట, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లోని చాలా హాస్టల్ యాజమాన్యాలు అందరినీ ఖాళీ చేయించాయి. దీంతో హాస్టళ్ళలో ఉండే మహిళలు సహా విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపై పడ్డారు. హైదరాబాద్ పోలీసులకు తమ గోడు చెప్పుకోవడంతో వారు పాస్‌లు అరేంజ్ చేశారు.

హాస్టల్స్ ఖాళీ చేయించిన వారికి పోలీసులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇచ్చాయి. ఈ సర్టిఫికెట్ 24 గంటలు చెల్లుతుంది. అది కూడా కేవలం వెళ్లడానికి మాత్రమే. తిరిగి రావడానికి కాదు. ఇలా ఎంతోమందికి పాస్‌లు ఇచ్చారు. ఆ పాస్‌లు తీసుకున్నవారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పాస్‌లు తీసుకున్నాక వాహనాలు ఏర్పాటు చేసుకోవడం మరో ఇబ్బంది. ఇలా అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొని, తీరా తమ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళాక వారికి మరో గండం వచ్చి పడింది.

తెలంగాణ డీజీపీ షాకింగ్ ప్రకటన చేశారు. పోలీసులు ఇచ్చిన పాస్‌లు చెల్లవని, హాస్టల్ యాజమాన్యం వారిని ఖాళీ చేయించవద్దని ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థులను బయటకు పంపించవద్దన్నారు. కానీ అప్పటికే వందలు, వేలాది మంది తమ ప్రాంతాలకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న వారికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏపీలోకి ఎట్టి పరిస్థితుల్లోను రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. దీంతో పాస్‌లు తీసుకొని ఎన్నో ప్రయాసలకు ఓర్చి వెహికిల్స్ సిద్ధం చేసుకొని, అంద దూరం వెళ్లాక అనుమతి లేదనేసరికి షాక్‌కు గురయ్యారు. అప్పటికే హాస్టళ్ళ నుండి ఇబ్బందులతో వచ్చిన వారికి పాస్‌లు ఇచ్చి, వారిని పంపించడం, తెలంగాణ నుండి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వకపోవడం కిందిస్థాయి వారు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకుండానే పాస్‌లు మంజూరు చేసినట్లుగా కనిపిస్తోంది.

హైదరాబాద్ హాస్టళ్ల నుండి ఎవరినీ కదిలించవద్దని, వారిని అక్కడే ఉండనివ్వాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీ మంత్రి బొత్స ఫోన్ చేసి తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటకు పంపించడం, ఊళ్ళకు పంపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ పోలీసులు పాస్‌లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ చెప్పింది. ఇరు రాష్ట్రాల చర్చల అనంతరం హాస్టళ్ళ నుండి విద్యార్థులను ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేటీఆర్ కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే బయలుదేరిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here